హ్యాపీ బర్త్ డే కృష్ణా….
దుష్ట శిక్షణ… శిష్ట రక్షణ అంటూ 9 అవతారాలు ఎత్తినా తనివి తీరలేదు కదా నీకు… ఎందుకంటావ్ ?
ఆ.. తెలిసిందిలే… స్వతహాగా ఆద్యంతాలతో పాటు పాపం అమ్మా నాన్నా కూడా లేని వాడివి కదా… అమృతం రుచి బోర్ కొట్టి , అమ్మ ప్రేమ కోసమే కదా నువ్వు మళ్ళి మళ్ళి అవతారాలు ఎత్తుతున్నది?
ఆ నవ్వులోనే అంతా అర్ధం అయిందిలే…
పైగా మరో అవతారం ఎక్కువ దూరం లో ఉంది అనేమో.. ఇద్దరు తల్లి తండ్రులని పెట్టుకున్నావు! దేవకీ వసుదేవులని, యశోదా నందులని… నిజామా కాదా? అంతే అయ్యుంటుంది.. లేకుంటే దుష్ట సంహారం నీకు పెద్ద పనా? ఒక్క సారి చెయ్యి ఇలా అంటే సమస్త జగత్తులూ నీలో ఐక్యం అయిపోవూ….అప్పుడు హాయిగా వటపత్ర సాయి లాగా కాలి బొటనవేలు నోట్లో వేసుకుని కూర్చోవూ ?
నువ్వు చేరిందే మొదలు బృందావనానికి యెంత శోభ వచ్చింది అనీ… ఇరుగు పొరుగు, పిల్లా జల్లా, పశువు పక్షి, చెట్టు చేమా ఎంత పరవశించిపోయాయో కదా… అటువంటి నీ రాక మాకెంతో సంతోషం…
నీ పుట్టిన రోజు నాడు .. మా పిల్లలకి నీ వేషం కట్టి ఫోటోలు అవి తీసుకుని మా చిన్ని క్రిష్నయ్య అని యెంత మురిసిపోతామో తెలుసా?… ఏం? తప్పేముంది ? వాళ్లకి నీకు ఎన్ని సారూప్యాలు ఉన్నాయో తెలుసా?
నీవు పసి బాలుడుగా ఉన్నప్పుడు ఎందర్నో రాక్షసుల్ని సంహరించావ్ అంట కదా … మా పిల్లలు కూడా అంతే… పోలియో పూతనని, కామెర్ల కాళిందిని, హేపీటైటస్ సకటాసురుని ఇంకా ఎన్నో రాక్షసాంతమైన వ్యాధుల్ని నివారించటం ద్వారా జయించుకుంటూ పెరిగి పెద్ద అవుతున్నారు… అందుకు నీకు కృతజ్ఞతలు….
మన్ను తిన్నావ్ కదా అని యశోద నీ చెవులు పిండి నోరు తెరిపిస్తే సమస్త లోకాలు చూపించావట కదా.. మా పిల్లలు కూడా అంతే… మాకు సమస్త లోకాలని చూపిస్తున్నారు.. కాకపొతే నోట్లో బదులు నెట్లో, ఫోన్ లలో, tab లలో.. అంతే తేడా లోకేశ్వరా ..
జగత్ గురు వైన నీకు.. కేవలం గురువుగా ఉన్నాడనే కాదా సాందీప మునికి గురు దక్షిణగా వేరే ఏ శిష్యుడు ఇవ్వని గురు దక్షిణ ఇచ్చావ్.. అతడి బిడ్డకి చూపుని ప్రసాదించి… బాగు బాగు… ఆ గురు భక్తినే మాకు మా పిల్లలకి కూడా ప్రసాదించు …
ఇంక నీ లవ్ లైఫ్ కి వస్తే… అప్పటికి.. ఇప్పటికి.. ఎప్పటికి… స్వచ్ఛమైన ప్రేమకి పరాకాష్ట అయిన ఆరాధనకు ఆదర్శం రాధ కృష్ణుల అనుబంధం… ఆ ఆరాధనా ఆ అనుబంధం మా జీవితాలలో దూరం కానీయకు రాధాగోపాలం …
అదే నీ రొమాంటిక్ లైఫ్ కి వస్తే.. అవన్నీ వర్ణించటం నా తరమా… చందన చర్చిత నీల కళేబర అంటూ అలనాటి జయదేవుని అష్టపది నుండి… ధీర సమీరే, యమునా తీరే అంటూ నిన్న మొన్నటి వేటూరి వరకు.. అందరూ నిన్ను స్లాగించి తరించిన వారే కదా….. మా ఉరుకుల పరుగుల హడావిడి జీవితాలలో కూడా కాస్త రొమాన్స్ ఉండేలా చూడు స్వామి
అంతా నిన్ను రొమాంటిక్ ఫెలో అంటారు గానీ … యెంత మంచి అన్నవు నువ్వు… నిండు కౌరవ సభలో పాంచాలి పాహి కృష్ణా అనగానే…. ఠక్కున మెరిశావ్.. చెల్లెలి మానం కాపాడావు… అంతేనా… సుభద్రని అర్జునుడికి ఇచ్చి కట్టపెట్టటం లోను.. ఎంతో టక్కరి తనాన్ని ప్రదర్శించి బలరాముని ఒప్పించావ్…
కేవలం బంధువులనే కాపాడావు అని విమర్శించే వాళ్ళకి.. చక్కటి సమాధానం కుచేలోపాఖ్యానం… చిన్ననాటి స్నేహితుడు.. గుప్పెడు అటుకులతో బిక్కు బిక్కు మంటూ
నీ ఇంటికి వచ్చినవాడిని గుండెలకి హత్తుకుని యెంత ప్రేమ, ఎంత ఐశ్వరం కురిపించావ్ అయ్యా.. అలాంటి స్నేహ గుణాన్ని మాలోనూ నింపు ధీన జన భాందవా ….
మనలో మన మాట… పారిజాత అపహరణం ఘట్టంలో సత్య భామ నిన్ను ఈడ్చిపెట్టి తన్నినప్పుడు… నువ్వు కలహించ కుండా… సంసారంలో ఎలా సర్దుకుపోవాలో, ఎక్కడ తగ్గాలో మాకు బాగా నేర్పావు…
అదే సత్య భామకి తులాభార ఘట్టంలో నిలువెత్తు బంగారానికి కాదు .. రుక్మిణి లాగా ప్రేమతో ఇచ్చే ఒక్క తులసి ఆకుకి లొంగుతాను అని చెప్పి నిన్ను ఎలా నెగ్గాలో కూడా నువ్వే నేర్పావ్ …
ఇవన్నీ సరే గాని.. పాండవులు అంటే నీకెందుకు అంత ఇష్టం.. మరీ ముఖ్యంగ అర్జునుడు అంటే.. నీ బావ మరిది అనా? కాదులే… ధర్మం పట్టుకున్నాడని.. అంతే కదా!
భలే కాపాడుకున్నావ్ లే… లేకుంటే అఖిలాండ కోటి బ్రమ్మాండ నాయకుడివి అయిన నీవు.. నీ భక్తుడి పాదాల వద్ద కూర్చుని రథం తోలటామా.. ఎంత లొంగిపోయావ్ అయ్యా పార్థ సారథి…
అది సరే గాని… వేదాంత సంహిత అయినా సమస్త ఉపనిషద్ సారాన్ని నువ్వు భగవద్గీత గ్రంధంగా అందిస్తే.. మా జనాలు ఏంటి స్వామి.. దాన్నో చావు మేళం లాగా వాడుతున్నారు ? ఈ పరిస్థితి మార్చు దేవతిదేవ…. మా బతుకులలో దీపం చూపే జ్ఞ్యాన స్తంభం గ ఆ గ్రంధాన్ని నిలుపు గీతాచార్యా….
నీ జోక్యంతో, నీ లౌక్యం తో పాండవులని కాపాడి, ధర్మాన్ని గెలిపించి…. ధర్మ రాజు చేత అశ్వమేథ యాగాదులు చేయించి.. చివరకి అశ్వద్ధామ అర్ధం లేని కోపానికి బలి కాపోతున్న
ఉత్తరా గర్భం లో ఉన్న శిశువుని కాపాడి.. చంద్రవంశాన్ని నిలబెట్టి… ఏ అవతార ప్రయోజనం కోసం అయితే జన్మ ఎత్తావో ఆ పనిని పరిపూర్ణం చేసుకుని, భౌతికంగా నిష్క్రమించిన
కృష్ణా… సృష్టి ఉన్నంత వరకూ నీ ఉనికి అజరామరం…
ఆత్మావలంబకులకు ఆలవాలమై… ఆధ్యాతిక ఆనంద సాధకులకు కేంద్ర బిందువై… యోగీశ్వరుల హృదయ స్థానమై… నిత్యం చెలించే కృష్ణా…
నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే హితుడవు… నీవు తప్ప ఇతఃపరంబులు ఎరుగను తండ్రీ….
అసతోమా సద్గమయ (అజ్ఞ్యానం లో నుండి జ్ఞ్యానం లోకి )
తమసోమా జ్యోతిర్గమయా (చీకటి లో నుండి వెలుగు లోకి )
మృత్యోర్మా అమృతంగమయా (మృత్యువు నుండి అమృతత్వము లోకి, మమ్ము నడుపుము కృష్ణా )
ఓం శాంతి శాంతి శాంతి:
ఇట్లు,
నీలోని నేను